గులాబీ

రంపపు పురుగులు

Tenthredinidae

కీటకం

క్లుప్తంగా

  • గులాబీ ఆకులను ఇవి తినడం వల్ల కలిగే నష్టం కనిపిస్తుంది.
  • ఆకులు కాగితంలా పలుచగా, పారదర్శకంగా, ఎండిపోయి, ముడుచుకుని, వాడిపోతాయి.
  • ఆకులు రాలిపోవడం మరియు మొక్క బలహీనపడటం.జరుగుతుంది.
  • చిన్న, పసుపు-ఆకుపచ్చ రంగు నత్తలాంటి లార్వాలు కనిపిస్తాయి.

లో కూడా చూడవచ్చు

1 పంటలు
గులాబీ

గులాబీ

లక్షణాలు

ఈ తెగులు ప్రారంభ సంకేతాలు, ఆకు ఉపరితలంపై చిన్న, పారదర్శక మచ్చలుగా కనిపిస్తాయి, కేవలం ఈనెలు మరియు పలుచని, కాగితంలాంటి పొర మాత్రమే మిగిలి ఉంటుంది. ఇవి ఆకులను తినడం కొనసాగిన కొద్దీ దెబ్బతిన్న ప్రాంతాలు విస్తరించి, ఎండిపోయి, గోధుమ రంగులోకి మారి, ఆకు ముడుచుకుని, వాడిపోయేలా చేస్తాయి. తీవ్రమైన తెగులు సోకినప్పుడు, అది మొత్తం ఆకులను తినేసి, మొక్కను పూర్తిగా ఆకుల్లేనిదిగా చేస్తుంది. తెగులు తీవ్రత తక్కువగా వున్నప్పుడు సాధారణంగా బాగా పెరిగిన గులాబీ మొక్కలకు హాని కలిగించనప్పటికీ, పదేపదే లేదా తీవ్రమైన దాడులు మొక్కను గణనీయంగా బలహీనపరుస్తాయి, దీనివల్ల ఇతర తెగుళ్లు మరియు శిలీంధ్ర వ్యాధుల వంటి ద్వితీయ స్థాయి ఒత్తిళ్లకు గురయ్యే అవకాశం పెరుగుతుంది.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

తక్కువ విషపూరితమైన, సేంద్రీయంగా ఆమోదయోగ్యమైన అనేక ఉత్పత్తులను లార్వాలపై నేరుగా కూడా ఉపయోగించవచ్చు: కీటకనాశక సబ్బు చిన్న లార్వాలను తాకిన వెంటనే చంపుతుంది; ఆకు యొక్క పై మరియు క్రింది భాగాలపై ఇది పూర్తిగా కవర్ అయ్యేలా చూసుకోండి. వేప నూనె లార్వాల ఆహార సేకరణ మరియు వృద్ధికి అంతరాయం కలిగిస్తుంది; పరాగసంపర్క కీటకాలకు హాని కలగకుండా ఉండేందుకు, దీనిని తెల్లవారుజామున లేదా సాయంత్రం పూట పిచికారీ చేయండి. స్పినోసాడ్ ఆకు కణజాలంలోకి శోషించబడి, ఆహారం తీసుకున్నప్పుడు లార్వా యొక్క నాడీ వ్యవస్థను దెబ్బతీస్తుంది; ఇది ప్రభావవంతమైనదే అయినా, తేనెటీగలు మరియు కొన్ని ప్రయోజనకరమైన కీటకాలపై ప్రతికూల ప్రభావం చూపగలదు, కాబట్టి జాగ్రత్తగా పిచికారీ చేయండి. కీటకాలను తినే పక్షులు, పరాన్నజీవి కందిరీగలు, బీటిల్స్, శిలీంధ్ర మరియు వైరల్ వ్యాధులు, మరియు చిన్న క్షీరదాలతో సహా అనేక సహజ శత్రువులు రంపపు పురుగుల జనాభాను తక్కువ స్థాయిలో ఉంచుతాయి మరియు వ్యాప్తి చెందుతున్న జనాభాను తగ్గించగలవు. ఈ సహజ శత్రువులకు సపోర్ట్ ఇవ్వడం అత్యంత సుస్థిరమైన దీర్ఘకాలిక వ్యూహం.

రసాయన నియంత్రణ

ఎల్లప్పుడూ ముందస్తు నివారణ మరియు జీవసంబంధమైన చర్యలతో కూడిన సమగ్ర సస్యరక్షణ విధానాన్ని పరిగణలోకి తీసుకోండి. రసాయన పురుగుమందులు వీటి సహజ శత్రువులకు హాని కలిగిస్తాయి. అందువలన వీటి వ్యాప్తి ప్రమాదకర స్థాయికి చేరినప్పుడు మరియు ఇతర నియంత్రణ పద్ధతులు సరిపోనప్పుడు మాత్రమే వీటిని వాడాలి. చికిత్స అవసరమైతే, విస్తృత చర్య కలిగిన పురుగుమందుల కంటే లక్షిత, తక్కువ విషపూరిత ఉత్పత్తులను ఎంచుకోండి.

దీనికి కారణమేమిటి?

టెంత్రెడినిడే (Tenthredinidae) కుటుంబానికి చెందిన సాఫ్లైస్ (sawflies) లార్వాల వల్ల ఈ నష్టం కలుగుతుంది, ఇవి గులాబీ ఆకుల మృదువైన కణజాలాన్ని తింటాయి. పెద్ద రంపపు పురుగులు తమ రంపం లాంటి అవయవాన్ని ఉపయోగించి ఆకుల అడుగు భాగంలో గాట్లు పెట్టి, అక్కడ గుడ్లు పెడతాయి. గుడ్లు పొదిగిన తర్వాత, లార్వాలు సుమారు నాలుగు వారాల పాటు ఆకులను తిని, ఆ తర్వాత ప్యూపాగా మారడానికి నేలలోకి పడిపోతాయి. పెద్ద రంపపు పురుగులు దృఢమైన, కందిరీగ లాంటి కీటకాలు. సాధారణంగా ఇవి నలుపు లేదా ముదురు రంగులో ఉండి రెండు జతల రెక్కలను కలిగి ఉంటాయి. జాతిని బట్టి, సంవత్సరానికి ఒకటి నుండి మూడు తరాలు ఉత్పత్తి కావచ్చు, సాధారణంగా వసంతకాలం చివరిలో మరియు వేసవికాలం ప్రారంభంలో ఇవి ఆకులను అధికమొత్తంలో ఆహారంగా తీసుకోవడం వలన మొక్కకు తీవ్రమైన నష్టం జరుగుతుంది.


నివారణా చర్యలు

  • తెగుళ్లను ముందుగానే గుర్తించడానికి, ముఖ్యంగా వసంతకాలంలో, ఆకుల రెండు వైపులా క్రమం తప్పకుండా తనిఖీ చేయండి.
  • తెగులు సోకిన ఆకులను తొలగించి నాశనం చేయండి లేదా లార్వాల సంఖ్య తక్కువగా ఉన్నప్పుడు వాటిని చేతితో ఏరివేయండి.
  • మొక్కలపై బలమైన నీటి ధారతో లార్వాలను కొట్టివేయండి; అవి తిరిగి మొక్క పైకి ఎక్కడానికి ఇబ్బంది పడతాయి.
  • అధిక నత్రజని ఎరువుల వాడకాన్ని నివారించండి.
  • పరాన్నజీవి కందిరీగలు మరియు వీటి సహజ శత్రువులను ఆకర్షించడానికి గులాబీ మొక్కల దగ్గర తేనె అధికంగా ఉండే సహచర మొక్కలను నాటడం ద్వారా వీటి సహజ శత్రువులను ప్రోత్సహించండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి