క్యారెట్

క్యారెట్ లో ఎండుతెగులు

Alternaria dauci

శీలీంధ్రం

క్లుప్తంగా

  • ఆకుకొనలు మరియు అంచులపై ముదురు గోధుమ రంగు నుండి నలుపు రంగు మచ్చలు ఏర్పడతాయి.
  • ఆకులు మాడిపోయి, వాడిపోయినట్లు కనిపిస్తాయి.
  • మొదటగా కింది ముదురు ఆకులు ప్రభావితమవుతాయి.
  • ఆకు తొడిమలు చుట్టూ బెరడు ఏర్పడి చనిపోవచ్చు, ఆకులు కుప్పకూలతాయి.

లో కూడా చూడవచ్చు

1 పంటలు
క్యారెట్

క్యారెట్

లక్షణాలు

వ్యాధి సోకిన తొలి సంకేతాలు కింది, ముదురు ఆకుల అంచులు మరియు చివర్లలో చిన్న, క్రమరహిత, ముదురు గోధుమ రంగు నుండి నలుపు రంగు మచ్చలుగా కనిపిస్తాయి. ఈ మచ్చలు పరిమాణంలో మారవచ్చు మరియు వాటి చుట్టూ పసుపు రంగు వలయం ఉండవచ్చు. కాలక్రమేణా, ఈ మచ్చలు విస్తరించి ఒకదానితో మరొకటి కలిసిపోతాయి, దీనివల్ల ఆకులు మాడిపోయి, కాలిపోయినట్లు కనిపిస్తాయి. తీవ్రంగా ప్రభావితమైన ఆకులు ముడుచుకుపోయి చనిపోతాయి. వ్యాధి ముదిరిన దశలలో, ఆకు కాడలపై పెద్ద మచ్చలు కూడా ఏర్పడతాయి, కొన్నిసార్లు అవి ఆకు కాడలను పూర్తిగా చుట్టుముట్టి, ఆకులు విరిగిపోయేలా చేస్తాయి. అప్పుడప్పుడు, ఈ వ్యాధికారకం నేల మట్టంలో లేదా దానికి కొంచెం దిగువన ఉన్న లేత నారుమొక్కలకు సోకి, మొక్కలు కుళ్ళిపోవడానికి దారితీస్తుంది. యంత్రాలతో కోత సమయంలో వ్యాధి సోకిన ఆకు కాడలు సులభంగా విరిగిపోతాయి, దీనివల్ల వేర్లు నేలలోనే ఉండిపోవచ్చు.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

శిలీంద్రాన్ని ముందస్తు నివారణ చర్యగా చికిత్స చేయాలి. రాగి ఆధారిత ఉత్పత్తులు ఈ వ్యాధిపై ప్రభావం చూపుతాయని నిరూపించబడింది మరియు ఈ శిలీంద్రాన్ని ఎదుర్కోవడానికి ట్రైకోడెర్మా మరియు బాసిల్లస్ జాతుల ప్రభావాన్ని కూడా కొన్ని అధ్యయనాలు ప్రస్తావించాయి. అన్ని జీవ నియంత్రణ పద్ధతుల మాదిరిగానే, క్యారెట్ రకం మరియు పర్యావరణ పరిస్థితులను బట్టి వాటి ప్రభావం మారవచ్చు. ఉత్తమ ఫలితాల కోసం, జీవ చికిత్సలను ఎల్లప్పుడూ సాగు మరియు నివారణ చర్యలతో కలిపి వాడటాన్ని పరిగణలోకి తీసుకోండి.

రసాయన నియంత్రణ

నివారణ చర్యలతో పాటు, అందుబాటులో ఉంటే జీవ చికిత్సలను కూడా కలిపి ఒక సమగ్ర విధానాన్ని ఎల్లప్పుడూ పరిగణలోకి తీసుకోండి. మొదటి లక్షణాలు కనిపించినప్పుడు శిలీంద్రనాశినుల వాడకాన్ని ప్రారంభించాలి, లేదా ఈ వ్యాధి సాధారణంగా సంభవించే తేమతో కూడిన ప్రాంతాలలో నివారణ చర్యగా వాడాలి. పంట ఆకులు దట్టంగా పెరిగేకొద్దీ, పంట పైభాగం మందులతో పూర్తిగా కవర్ చేయడం కష్టమవుతుంది, కాబట్టి మందులను ముందుగా వాడితే అది మరింత ప్రభావవంతంగా ఉంటుంది. నిరోధకత పెరిగే ప్రమాదాన్ని తగ్గించడానికి, శిలీంద్రనాశినులను మార్చి మార్చి వాడాలి. రాగి ఆధారిత ఉత్పత్తులను కూడా రిజిస్టర్ చేయబడిన శిలీంద్రనాశినులతో మార్చి మార్చి వాడవచ్చు. ఇవి ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులుపై ప్రభావవంతంగా పనిచేస్తాయని నిరూపించబడ్డాయి మరియు అదనంగా బాక్టీరియల్ ఆకుమచ్చ తెగులును అణచివేయడంలో కూడా సహాయపడవచ్చు..

దీనికి కారణమేమిటి?

ఈ వ్యాధి ఆల్టర్నేరియా డాసీ అనే శిలీంధ్రం వల్ల వస్తుంది. ఇది వ్యాధి సోకిన లేదా కలుషితమైన విత్తనాల ద్వారా వ్యాపిస్తుంది మరియు వ్యాధి సోకిన పంట అవశేషాలు, వాటంతట అవే మొలిచిన క్యారెట్ మొక్కలపై మనుగడ సాగించగలదు. సజీవమైన మొక్కలు లేకుండా ఈ శిలీంధ్రం నేలలో జీవించలేదు. శిలీంధ్ర బీజాలు గాలి ద్వారా, వర్షం లేదా పైనుంచి నీరుపెట్టడం వలన చుట్టుపక్కల మొక్కలకు వ్యాపిస్తాయి, మరియు గాలి ద్వారా, వ్యవసాయ పరికరాలపై చాలా దూరం ప్రయాణించగలవు. మితమైన నుండి వెచ్చని ఉష్ణోగ్రతలు (16-35°C) మరియు ఆకులు ఎక్కువ సేపు తడిగా ఉండటం వ్యాధి సోకడానికి అనుకూలంగా ఉంటాయి. సాధారణంగా, బీజాంశాలు మొలకెత్తి మొక్కకు సోకడానికి ఆకులు 8 నుండి 12 గంటల పాటు తడిగా ఉంటే చాలు. ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ, వ్యాధి సోకడానికి అవసరమైన తడి సమయం తగ్గుతుంది. సాధారణంగా, తక్కువ ఎరువులు వేసిన, ఒత్తిడికి గురైన మొక్కలలో వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటుంది.


నివారణా చర్యలు

  • ధ్రువీకరించబడిన, వ్యాధి రహిత విత్తనాలను మరియు అందుబాటులో ఉన్నచోట వ్యాధి నిరోధక లేదా వాదిని తట్టుకునే రకాలను ఉపయోగించండి.
  • గాలి ప్రసరణను మెరుగుపరచడానికి మరియు ఆకులు తడిగా ఉండే సమయాన్ని తగ్గించడానికి మొక్కల మధ్య ఎక్కువ దూరం ఉండేలా మరియు ఎత్తైన గట్లను ఉపయోగించండి.
  • పైనుండి నీరు పెట్టకండి; తప్పనిసరి అయితే, ఆకులు త్వరగా ఆరిపోయేలా పగటిపూట నీరు పెట్టండి.
  • తగినన్ని ఎరువులు వేయండి.
  • సమయానికి పంటను కోయండి మరియు పంటకోత తర్వాత వెంటనే పంట వ్యర్థాలను నేలలో కలిపివేయండి.
  • వ్యాధి సంక్రమించే రిస్క్ ని తగ్గించడానికి కనీసం రెండు సంవత్సరాల పాటు వేరే పంటలతో పంట మార్పిడి చేయండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి