Myrothecium roridum
శీలీంధ్రం
కాండం మరియు మొక్క పైభాగం కుళ్లిపోవడం, ఆకులపై గోధుమ రంగులో కేంద్రీకృతమైన మచ్చలు ఈ మైరోతెసియం ఆకు మచ్చ తెగులు లక్షణాలు. అధిక తేమ వద్ద ఈ మచ్చలపైన ఉబ్బెత్తుగా వున్న నల్లని నిర్మాణాలు మరియు తెల్లని కుచ్చు ఏర్పడవచ్చు. ఉద్యానవన పంటల్లో, మొక్క పైభాగంలో మరియు ఆకు కాడల ప్రక్కన ఒక మెత్తని గోధుమ రంగు కుళ్ళుగా లక్షణాలు మొదలవుతాయి. కాడల వెంబడి ఈ గాయాలు పెరుగుతున్నప్పుడు, ప్రభావిత కణజాలంపై చిన్న తెల్లని కుచ్చు కనిపిస్తుంది. ఆకుల అంచుల వద్ద, సక్రమంగా లేని చిన్న గోధుమ నుండి నల్లని రంగులో చుక్కలు ఏర్పడతాయి. క్రమంగా ఒక సృష్టంగా నిర్వచించబడిన మధ్య కేంద్రీకృతమైన రింగ్ తో ఈ మచ్చలు గుండ్రంగా మారతాయి. తరువాత ఈ పాత గాయాలు ఒకదానితో మరొకటి కలిసిపోయి, చిన్న చిన్న తెల్లని మచ్చలతో కప్పబడతాయి. ఇవి ఎండిపోయినప్పుడు ఈ గాయాల మధ్యభాగం తెల్లగా, పేపర్ లాగ మారి, చివరికి ఆకులలో వంకర టింకరగా వున్న షాట్ రంధ్రాలు వదిలి, రాలిపోతాయి. తరువాత దశల్లో మొత్తం మొక్క కుప్పకూలిపోవచ్చు కానీ పండ్లకు మాత్రం నష్టం కలగదు.
ఈ తెగులును నియంత్రించడానికి ఎటువంటి జీవ నియంత్రణ అందుబాటులో లేదు. ఈ ఫంగస్ ను నియంత్రించే చికిత్స మీకు ఏమైనా తెలిసినట్లైతే దయచేసి మాకు తెలియచేయండి.
వీలైనంతవరకు ఎల్లపుడూ నివారణ చర్యలతో కూడిన జీవసంబంధమైన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. ఈ తెగులు లక్షణాలు కనపడగానే ఒక హెక్టారుకు 2 కిలోల మాంకోజెన్ లేదా కాపర్ ఆక్సీక్లోరైడ్ పిచికారీ చేయండి. ఇలా ప్రతి 15 రోజులకు ఒకసారి రెండు నుండి మూడుసార్లు పిచికారీ చేయండి. సీజన్లో ఆలస్యంగా ఈ తెగులు సంక్రమించినట్లైతే పంట కోతలు ముందు విరామాన్ని పరిగణలోకి తీసుకోండి.
ఈ లక్షణాలు మైరోతెసియం రోరిడం అనే ఫంగస్ వలన కలుగుతాయి. ఈ ఫంగస్ ఆర్ధికంగా ముఖ్యమైన పంటలలో మొక్క పైభాగం మరియు కాండం కుళ్లిపోయేటట్టు చేస్తుంది. ఈ తెగులు చాలా రకాలుగా విస్తరిస్తుంది. ఉదాహరణకు నాట్లు వేస్తున్నప్పుడు సరైన పద్ధతులు పాటించకపోవడం, మొక్కలకు పైనుండి నీరు పెట్టడం, యంత్రాల వలన లేదా కీటకాల వలన మొక్కలకు దెబ్బలు తగలడం మొదలైనవి. ఇలా దెబ్బతిన్న కణజాలం ఫంగస్ కు ప్రవేశ ప్రాంతాలుగా ఉంటాయి. వెచ్చని, తడి వాతావరణం మరియు అధిక తేమ వున్న ప్రాంతాలలో ఈ తెగులు సంక్రమించే అవకాశం మరియు తీవ్రత అధికంగా ఉంటుంది. అధిక మోతాదులలో ఎరువులను వాడడం వలన కూడా అధిక పచ్చదనం పెరిగి దాని వలన ఈ తెగులు సంక్రమించే అవకాశం ఉంటుంది.