శ్రద్ధ
విజయవంతమైన బంగాళాదుంప పంటకు ఆరోగ్యకరమైన, తెగుళ్లు లేని విత్తన దుంపలను ఉపయోగించడం చాలా ముఖ్యం. మొక్కలు బాగా ఎదగడానికి, పందిరి వృద్ధి చెందుతున్న సమయానికి (నాటిన 4 వారాలలోపు) కలుపు మొక్కలను తొలగించాలి. ప్రతి 15-20 రోజులకు ఒకసారి మొక్క చుట్టూ మట్టిని కుప్పలుగా చేయడం కలుపు మొక్కల పెరుగుదలను పరిమితం చేయడానికి మరియు మట్టి వదులుగా అవ్వడానికి సహాయపడుతుంది. బంగాళాదుంలో పోషక అవసరాలు అధికంగా ఉన్నందున, ఆకుపచ్చ ఎరువును ఒక ఎరువుగా సిఫార్సు చేయబడింది. బంగాళాదుంప మొక్క వేరు వ్యవస్థ లోతు తక్కువగా ఉన్నందున నీటిని తక్కువగా పెట్టాలి. పంటకోత తర్వాత బంగాళాదుంపలను 10-15 రోజులు నీడలో ఆరబెట్టాలి. దీనివలన దుంప పైతొక్క త్వరగా ఆరుతుంది. ముఖ్యంగా చెరుకు, సోపు, ఉల్లి, ఆవాలు, గోధుమ లేదా అవిసె పంటల్లో అంతర పంటగ వేయడానికి బంగాళాదుంప అనువుగా ఉంటుంది.
మట్టి
బంగాళాదుంపలను ఉప్పు మరియు క్షార నేలలు మినహా దాదాపు ఏ రకమైన మట్టిలోనైనా పెంచవచ్చు. సహజంగా వదులుగా ఉండే, దుంపల పెరుగుదలకు తక్కువ నిరోధకతను అందించే నేలలు అనుకూలంగా ఉంటాయి. గరప మరియు ఇసుక నేలలు, సేంద్రీయ పదార్థాలను సమృద్ధిగా కలిగిన నేలలు, మంచి డ్రైనేజీ వ్యవస్థ కలిగిన నేలలు మరియు గాలి ప్రసరణ జరిగే నేలలు బంగాళాదుంప పంట సాగుకు చాలా అనుకూలంగా ఉంటాయి. 5.2-6.4 పిహెచ్ పరిధి కలిగిన నేలలు ఆదర్శంగా పరిగణించబడతాయి.
వాతావరణం
బంగాళాదుంప ఒక సమశీతోష్ణ వాతావరణ పంట, అయితే ఇది విభిన్న వాతావరణ పరిస్థితులలో పెరుగుతుంది. ఇవి పెరిగే సీజన్లో ఉష్ణోగ్రత మధ్యస్థంగా చల్లగా ఉండే ప్రదేశాలలో మాత్రమే ఇది పెరుగుతుంది. మొక్క పెరుగుదలకు 24°C ఉష్ణోగ్రత ఉత్తమమైనది. దుంపల అభివృద్ధికి 20°C ఉష్ణోగ్రత అనుకూలంగా ఉంటుంది. అందువలన బంగాళాదుంపను కొండ ప్రాంతాల్లో వేసవి పంటగా మరియు ఉష్ణమండల మరియు ఉపఉష్ణమండల ప్రాంతాలలో శీతాకాలపు పంటగా పండిస్తారు. దీనిని సముద్ర మట్టానికి 3000 మీటర్ల ఎత్తు వరకూ పెంచవచ్చు.