శ్రద్ధ
వేరుశెనగ మొక్క ఫాబాసియా కుటుంబానికి చెందిన పప్పుదినుసు, ఇది ఉష్ణమండల మరియు ఉపఉష్ణమండలాలలో విస్తృతంగా పెరుగుతుంది. వేరుశెనగ అనేది వాటి పోషక ఉపయోగం కోసం పెంచే ధాన్యం మరియు దానిలో ఉండే అధిక నూనె మరియు కొవ్వు పదార్థాల కారణంగా ఇది "నూనె పంట" గా వర్గీకరించబడింది. వేరుశెనగ దక్షిణ అమెరికాలో పుట్టింది, కానీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సాగు చేస్తున్నారు. 20 కి పైగా దేశాల్లో సుమారు 42 మిలియన్ ఎకరాలలో వేరుశెనగను పండిస్తున్నారు, ప్రపంచ ఉత్పత్తిలో అత్యధికంగా సుమారు 37% వరకు చైనా ఉత్పత్తి చేస్తుంది.
మట్టి
తేలికపాటి, ఇసుకతో కూడిన గరప నేలలు, మంచి మురుగునీటి పారుదల సౌకర్యం కలిగిన నేలలు, ఎర్ర గరప నేలల్లో వేరుశెనగ బాగా పెరుగుతుంది. అధికంగా నీరు నిలుపుకునే అవకాశం ఉన్నందున ఎక్కువ బంక మన్ను కల నీరు నిలువ వుండే నేలలు వేరుశెనగ పంటకు అనుకూలంగా ఉండవు. బంక మట్టి నేలలు వంటి దట్టమైన నేలల గుండా వేరుశెనగ కాయ చొచ్చుకుపోవడం కష్టం. నేలలో గాలి ప్రసరణ ఉండాలి మరియు అది సేంద్రీయ పదార్థాలను మితంగా కలిగి ఉండాలి. కొద్దిగా ఆమ్లతత్వం వున్న నేలల్లో వేరుశెనగ వృద్ధి చెందుతుంది కాని 5.9-7 పిహెచ్ వున్న ఏ మట్టిలోనైనా పెరుగుతుంది.
వాతావరణం
పూర్తి ఎండతో వెచ్చని మరియు తేమతో కూడిన వాతావరణ పరిస్థితులు వేరుశెనగ ఉత్పత్తిని పెంచడానికి అనుకూలంగా ఉంటాయి. విజయవంతమైన వేరుశెనగ ఉత్పత్తికి, పంట ఎదిగే సీజన్లో సగటున రోజువారీ ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్ మరియు కనీసం 100-రోజుల తగిన ఉష్ణోగ్రత అవసరం. వేరుశెనగ ఉత్పత్తిలో ఉష్ణోగ్రత గొప్ప పరిమితి కారకం, వేరుశెనగ చల్లని మరియు తేమ వాతావరణాన్ని తట్టుకోగలిగినప్పటికీ ఈ పరిస్థితులు పంటకు తెగుళ్లు సోకడానికి అనుకూలంగా ఉంటాయి.