శ్రద్ధ
పుచ్చకాయ దక్షిణాఫ్రికాలో పుట్టింది. ఇది ఎడారి పండు, ఇందులో ప్రోటీన్లు, ఖనిజాలు మరియు కార్బోహైడ్రేట్లతో పాటు 92% నీరు ఉంటుంది. పుచ్చకాయలను ప్రధానంగా మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, పంజాబ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ మరియు ఉత్తర ప్రదేశ్లలో సాగు చేస్తారు.
మట్టి
లోతైన సారవంతమైన మరియు బాగా ఆరిన మట్టిలో పుచ్చ బాగా పెరుగుతుంది. ఇసుక లేదా ఇసుక గరప నేలలో పెరిగినప్పుడు ఇది మంచి ఫలితాలను ఇస్తుంది. మట్టిలో నుండి నీరు సులువుగా బైటకి వెళ్ళనట్లైతే తీగలకు ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకే పొలంలో ఒకే పంటను నిరంతరం సాగు చేయడం వల్ల పోషకాల నష్టం, తక్కువ దిగుబడి మరియు తెగుళ్ల దాడి అధికంగా జరుగుతుంది. కనుక పంట మార్పిడి చేయండి. నేల యొక్క పిహెచ్ 6.0 మరియు 7.5 మధ్య ఉండాలి. ఆమ్ల నేల విత్తనాలను ఎండిపోయేలా చేస్తుంది. తటస్థ పిహెచ్ ఉన్న మట్టి బాగా అనుకూలం అయినప్పటికీ కొద్దిగా క్షార నేలల్లో కూడా బాగానే పెరుగుతుంది.
వాతావరణం
వెచ్చని సీజన్ పంట కావడంతో, మొక్కకు పండ్ల ఉత్పత్తికి తగినంత సూర్యరశ్మి మరియు పొడి వాతావరణం అవసరం. భారతదేశంలో, వాతావరణం ఎక్కువగా ఉష్ణమండలంగా ఉన్నందున, అన్ని సీజన్లు పుచ్చకాయ సాగుకు అనుకూలంగా ఉంటాయి. అయితే, పుచ్చకాయ చల్లని, మంచుకు సున్నితంగా ఉంటుంది. అందు వలన శీతాకాలం తీవ్రంగా ఉన్న దేశంలోని కొన్ని ప్రాంతాల్లో మంచు సీజన్ గడిచిన తరువాత పుచ్చకాయలను పండిస్తారు. విత్తనాల అంకురోత్పత్తి మరియు పుచ్చకాయ మొక్కల పెరుగుదలకు 24 నుంచి 27⁰C అనువైనది.